దిక్కు తోచక దింగతాలన్నీ దిగాలుగా తిరిగేస్తుంటాను
స్మృతులన్నీ తలకిందపెట్టుకుని కలల్తో మిళితం చేస్తుంటాను
పాలపుంతలమధ్య కాంతి సంవత్సరాల కాలంలో సంచరిస్తుంటాను
శిధిలాల మధ్య చెదిరిన శరీరాన్ని ఏరి కూర్చేందుకు ప్రయత్నిస్తుంటాను
గాలి ఎటు వీస్తే అటు చెదిరిపోయే ప్రాణాలేమీ కావివి
బలవంతంగా బలహీనపడటానికి ఈ జీవితమేమీ శిలాజమూ కాదు
అయినా నిరాటంకంగా సందిగ్ధాలూ సందేహాలూ
చీకటి లోయాల్లోంచి కమ్ముకొచ్చే నవ్వు మెదడంతా ఆక్రమించేసుకుంటున్నట్టు
విలయాలను స్వీకర్ణించడానికి సిద్ధంగా లేక మనసు మధనపడుతున్నట్టు
అయినా సిగ్గుపడి ఊపిరి పీల్చడం మానేసినంత మాత్రాన మానానికొచ్చే ప్రమాదమేమీ లేదు
జీవితాల్లోని పరమార్ధాలు ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నవేళ
జాగ్రత్తగా పరుగు పెట్టడానికే ప్రయత్నిస్తుంటాను
రసాస్వాదనే అంతిమ ధ్యేయం కాననప్పుడు
సంగీతం విషాదంగా గొంతులోంచి జారుతుంది మరి
అంతఃపురంలో జీవించడమే అంతిమ అవకాశం కానప్పుడు
సంస్కార పునరుత్పత్తే ప్రత్యేక కార్యమవుతుంది మరి
అందుకే
నాలో మనసుని సున్నితంగా సంరక్షించుకుంటూ
నిట్టనిలువునా నాలోని సమస్యల్ని చీల్చేస్తూ గుండెత్తి గడిపేస్తుంటాను
బ్రతకాలంటే నిత్యం మనం హత్యలు చేస్తూనే ఉండాలి మరి
©gopi kiran